జమ్ముకశ్మీర్‌లో భూకంపం; రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.9 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది. ఉదయం 5.38 గంటలకు భూమి కంపించినట్లు ఎన్‌సీఎస్ తెలిపింది. అయితే ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం దోడా ప్రాంతంలో 10కి.మీలోతులో కేంద్రీకృతమైనట్లు ఎన్‌సీఎస్ వెల్లడించింది. ఈ సంవత్సరం జూన్ నుంచి దోడా దాదాపు 12సార్లు భూకంపం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 13న దోడాలో అత్యధికంగా 5.4 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఇళ్లు సహా డజన్ల కొద్దీ భవనాలు బీటలు వారాయి. ఇదిలా ఉండగా, సోమవారం ఆఫ్ఘనిస్థాన్‌లోని ఫైజాబాద్‌కు 93 కి.మీ దూరంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది.