Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ
మే 13న పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తూ కెమెరాకు చిక్కిన వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది. మాచర్ల నియోజకవర్గంలోని ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం) పాడైపోగా,పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి ప్రవేశించి ఈవీఎంను నేలకేసి పగలగొట్టిన దృశ్యాలు వెబ్‌కాస్టింగ్‌లో నమోదయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఈసీ, సంబంధిత వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి సాయంత్రం 5గంటల్లోగా నివేదిక ఇవ్వాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకుకి ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మెల్యే పై క్రిమినల్ చర్యలు.. భవిష్యత్ లో ఎన్నికలలో పాల్గొనకుండా నిషేదం
ఏడు ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చారు. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈవీఎం ధ్వంసానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఘటనకు బాధ్యులైన వారందర్ని ఆరెస్ట్ చేయాలని కూడా మీనా కోరారు. అలాగే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే పై క్రిమినల్ చర్యలతో పాటు భవిష్యత్ లో ఎన్నికలలో పాల్గొనకుండా నిషేదం విధించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
పిన్నెలిపై లుక్ ఔట్ నోటీసులు జారీ
ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని ఎయిర్‌పోర్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తం చేశారు. లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు పిన్నెల్లి తక్షణమే అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.