ECI: జమిలి ఎన్నికలు నిర్వహిస్తే రూ.10వేల కోట్లు అవసరం అవుతాయ్: ఎన్నికల సంఘం
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమలి ఎన్నికల నిర్వహణ ఖర్చుపై శనివారం భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) కేంద్రానికి ఓ లేఖ రాసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) కొనుగోలు చేసేందుకు ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఈసీఐ అంచనా వేసింది. ఇదే విషయాన్ని లేఖలో పేర్కొంది. ఒకసారి కొనుగోలు చేసిన ఈవీఎంను 15 ఏళ్లపాటు వినియోగించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే, ఒక యంత్రాన్ని గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఉపయోగించవచ్చు.
'వన్ నేషన్, వన్ ఎలక్షన్' కోసం అదనపు సౌకర్యాలు అవసరం: ఈసీఐ
'వన్ నేషన్, వన్ ఎలక్షన్' కోసం, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో రెండు ఈవీఎంలు అవసరం అవుతాయి. అందులో ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ స్థానానికి అవసరం అవుతాయి. మెషీన్లలో లోపం ఏర్పడితే, కొన్ని ఈవీఎంలను రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే.. 46,75,100 బ్యాలెట్ యూనిట్లు(బీయూ), 33,63,300 కంట్రోల్ యూనిట్లు(సీయూ), 36,62,600 ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) అవసరం అవుతాయని ఎన్నికల సంఘం పేర్కొది. ప్రస్తుతం ఒక బీయూ ధర రూ.7,900, సీయూ రూ.9,800, వీవీప్యాట్ ధర రూ.16,000గా ఉన్నాయి. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల అదనపు పోలింగ్, భద్రతా సిబ్బంది, ఈవీఎంలు, యంత్రాలను రవాణా చేయడానికి అదనపు వాహనాలు కూడా అవసరం అవుతాయని ఎన్నికల సంఘం పేర్కొది.