Telangana: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. ఈసీ షరతులతో కూడిన ఆమోదం
భారత ఎన్నికల సంఘం తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం పెట్టుకోవడానికి షరతులతో కూడిన ఆమోదం తెలపడంతో సోమవారం ఇక్కడ సమావేశం కానుంది. రైతు రుణమాఫీపై భారతీయ రాష్ట్ర సమితి (భారాస) వేసే రాజకీయ వత్తిళ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఊపిరి ఆడనివ్వడం లేదు. ఎన్నికల సంఘం షరతులతో కేబినెట్ బేజారు ఈ తరుణంలో ఎన్నికల సంఘం షరతుల నడుమ తెలంగాణలో ఇవాళ మంత్రివర్గ సమావేశం కానుంది. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో అత్యవసర అంశాలపైనే చర్చ ఉంటుంది. ఉమ్మడి రాజధాని పెండింగ్ అంశాలు, రైతుల రుణమాఫీపై చర్చించకూడదు అనీ, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను ఈ భేటీకి పిలవ వద్దని ఈసీ కండీషన్స్ పెట్టింది.
చప్పగా జరగనున్న కేబినెట్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ భేటీలో తేలికైన అంశాలపైనే చర్చిస్తారు. ప్రభుత్వం ముందుగా అనుకున్న ప్రకారం ఏపీ, తెలంగాణ విభజన అంశాలు, రైతుల రుణమాఫీ అంశాలను చర్చించాలనుకుంది. కానీ.. ఈసీ కుదరదని చెప్పడంతో.. ఈ అంశాలపై ఏ చర్చా ఉండదు. జూన్ 4న ఫలితాలు వస్తాయి కాబట్టి అప్పటి వరకూ కేబినెట్లో కీలక అంశాలను చర్చించకూడదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవచ్చని ఈసీ తెలిపింది.
రైతుల రుణాలపై మాట నిలబడకపోతే రేవంత్ రెడ్డి ఇరకాటమే
రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 లోగా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. ఐతే.. ఇదివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణాలను మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ నమ్మకంతో చాలా మంది రైతులు రుణాలు తీసుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు దాటినా ఇంకా రుణమాఫీ అమలు చెయ్యలేదు. దాంతో రైతులు చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయి. అందువల్ల కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని.. త్వరగా అమలు చేస్తారని రైతులు ఎదురుచూస్తుంటే.. ఈసీ నిర్ణయంతో.. అమలు మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక.. మళ్లీ కేబినెట్ భేటీ ఎప్పుడు జరుపుతారో, ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారో, ఎప్పుడు అమలు చేస్తారో అనేది తేలాల్సిన అంశం.