
Bihar Elections: బీహార్‌లో రాజకీయ పార్టీలతో 'ఈసీ' సమావేశం.. ఎన్నికల సన్నద్ధతపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. క్రమంలో ఎన్నికల అధికారులు రెండు రోజుల పాటు బీహార్ పర్యటనలో పాల్గొననున్నారు. ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్, కమిషనర్లు వివేక్ జోషి, ఎస్.ఎస్. సంధు శుక్రవారం, శనివారం పాట్నాలో పర్యటించనున్నారు. శనివారం రాజకీయ పార్టీలతో భేటీ అయి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష చేపట్టనున్నారు. ఈ పర్యటన ముగిసిన అనంతరం ఢిల్లీలోకి తిరిగి వెళ్లి, వచ్చే వారం ఎప్పుడో ఒక సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని సమాచారం. ఈరోజు ఉదయం 10 గంటలకు బీహార్‌లో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరుగనుంది.
Details
బీహార్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 243
ప్రతి పార్టీ నుంచి ముగ్గురు ప్రతినిధులు హాజరు కావాల్సిందిగా ఆహ్వానం పంపారు. ఈ సందర్భంగా పార్టీల నుంచి సూచనలు, అభిప్రాయాలు, ఇతర సమాచారం స్వీకరించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఇప్పటికే సెప్టెంబర్ 30న బీహార్ తుది ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేసింది. మొత్తం 7 కోట్ల 42 లక్షల మంది ఓటర్లు రాష్ట్రంలో ఉన్నారని అధికారికంగా ప్రకటించింది. బీహార్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 243. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2025 నవంబర్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ చివరి నాటికో లేదా నవంబర్ ప్రారంభంలోనో ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.