ECI: లోక్‌సభ ఎన్నికల వేళ.. ఓటరు జాబితా నుంచి 1.66 కోట్ల మంది పేర్లు తొలగింపు.. కారణం ఇదే
లోక్‌సభ ఎన్నికల వేళ.. ఎన్నికల సంఘం 1.66 కోట్ల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. అదే సమయంలో, సవరించిన జాబితాలో 2.68 కోట్ల మందికి పైగా పేర్లు కూడా చేర్చబడ్డాయి. దీంతో 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన ఓటర్ల సంఖ్య 97 కోట్లకు చేరింది. వీరిలో 1.83 మంది 18ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు వారు ఉన్నారు. వీరు కొత్తగా ఓటు వేయనున్నారు. 6 రాష్ట్రాలు మినహా మొత్తం ఓటర్ల సవరణ జరిగిందని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది. అసోం, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణలో ఇటీవల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో జాబితాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.
ఫిబ్రవరి 12న తదుపరి విచారణ
'సేవ్ కాన్‌స్టిట్యూషన్ ట్రస్ట్' దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఓటరు జాబితా నుంచి డూప్లికేట్ పేర్లను తొలగించి వారి సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని ఈ పిటిషన్‌లో కోరారు. ఈ పిల్‌ను విచారించిన సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ఎన్నికల కమిషన్ నుంచి వివరాలు కోరింది. మరణం లేదా పేరు పునరావృతం కారణంగా ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వారి గణాంకాలను సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం సమర్పించింది. ఈ జాబితాపై ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు బెంచ్ తదుపరి విచారణ చేపట్టనుంది. జనవరి 1, 2024వరకు మొత్తం 2,68,86,109మంది కొత్త ఓటర్లు చేరారని, మరణాలు, నకిలీలు లేదా ఇతర ప్రాంతాలకు మారిన కారణంగా 1,66,61,413మంది పేర్లు తొలగించబడ్డాయని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.