LOADING...
PM Modi: ప్రపంచ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టారిఫ్‌ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ప్రపంచ మార్కెట్‌లో ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 15, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా న్యూఢిల్లీ ఎర్రకోట ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, అమెరికా సుంకాల హెచ్చరికల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత సామర్థ్యాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.

వివరాలు 

 స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలి 

"ఇది చరిత్రలో కొత్తఅధ్యాయం రాసే సమయం.ప్రపంచమార్కెట్‌ను మన ఆధీనంలోకి తీసుకోవాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలి.తక్కువ ధరతో,అధిక నాణ్యత కలిగిన వస్తువులు అందించడమే మన లక్ష్యం కావాలి.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రయోజనాలు ముందుకు వస్తున్నాయి.మనం వెనుకాడకుండా ముందుకు సాగాలి. ఇతరులను తక్కువ చేసి మాట్లాడడంలో సమయాన్ని వృథా చేయకుండా,మన స్వంత బలాన్ని పెంపొందించడంపైనే దృష్టి పెట్టాలి" అని మోదీ అన్నారు. అలాగే,దేశంలోని వ్యాపారులు,చిన్న పెద్ద దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రపంచం భారత్ పురోగతిని జాగ్రత్తగా గమనిస్తోందని,అవసరమైతే ప్రభుత్వ విధానాల్లో మార్పులు సూచించాలని పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటిచర్యలూ సహించబోమని,వారు దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన తోడ్పాటు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఏ పరిస్థితుల్లోనైనా రైతులకు అండగా నిలబడతానని హామీ ఇచ్చారు.

వివరాలు 

అణు ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడులకు స్వాగతం 

భారతదేశం ఇంధన రంగంలో కూడా స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ వంటి పునరుత్పాదక ఇంధనాల వైపు దేశం వేగంగా అడుగులు వేయాలని సూచించారు. అణు ఇంధన ఉత్పత్తి విషయంలో కూడా దేశం ప్రగతి సాధిస్తోందని తెలిపారు. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ దిగుమతులకే లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని, కొత్త రకాల ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులను తగ్గించడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. దిగుమతులు తగ్గితే స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని, ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కీలక ఖనిజాల కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు.