ED: దేశంలోనే తొలిసారి ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ-వేలం ద్వారా ఒక విమానాన్ని విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్ 800ఎ విమానాన్ని విక్రయించేందుకు జులై 1న ఎంఎస్‌టీసీ వేదికగా ఈ-వేలం నిర్వహించింది. ఈ విమానం ఫాల్కన్ పోంజీ కేసు ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందినది. గత ఏడాది మార్చి 7న శంషాబాద్ విమానాశ్రయంలో ఈడీ అధికారులు దీనిని స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు
రూ.792 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్పడిన అమర్‌దీప్ కుమార్
నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో అమర్‌దీప్ కుమార్ రూ.792 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్పడినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. అనంతరం పీఎంఎల్‌ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతి మేరకు విమానాన్ని ఈ-వేలంలో విక్రయించారు. ఈ వేలం ద్వారా లభించిన రూ.3 కోట్లను బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అధికారులు, మరిన్ని వివరాల కోసం దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలిపారు.