10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
10వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. గతంలో ఏపీలో 10వ తరగతి పరీక్షా పేపర్లు లీక్ అయిన నేపథ్యంలో తెలంగాణలో కూడా కార్పొరేట్, పలు ప్రవేటు పాఠశాలలు అలా అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఉండేందుకు నిఘాను పటిష్టం చేసేందుకు ప్రత్యేక చర్యలను విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం పరీక్ష హాలులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పరీక్ష పత్రాల సీల్ ఓపెన్ చేసినప్పటి నుంచి జవాబు పత్రాలను తిరిగి ప్యాక్ చేసే వరకు.. ఈ ప్రక్రియ అంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేయాలని ఈ మేరుక ఆదేశాలు జారీ చేసింది.
పదో తరగతి పరీక్షలు
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు
ప్రధానంగా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారి గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. సర్కారు స్కూళ్లలన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని సూచించింది.
పదో పరీక్షలను ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు. దాదాపు 5.1లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
పరీక్షల్లో రికార్డయిన డేటా నిక్షిప్తం చేయాలని, ఆ తర్వాత సాఫ్ట్ కాపీని భద్రపర్చాలని, సీసీ పుటేజీలకు ప్రత్యేక మానిటర్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
సీసీ కెమెరాల కొనుగులు లేదా కిరాయికి జిల్లా కలెక్టర్లు సహకరించాలని సూచించింది.