Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి ప్రభావం.. ఏజెన్సీ ప్రాంతాల్లో వణుకుతున్న ప్రజలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తన ప్రభావాన్ని చూపుతోంది. రోజురోజుకు పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా మంచు గడ్డకట్టినట్లు అనిపిస్తోంది. సాయంత్రం ఐదు గంటల తరువాత చలి తీవ్రత అధికమవుతోంది. ప్రజలు స్వెట్టర్లు, చలిమంటలతో చలికి విముక్తి పొందుతున్నారు. ఉదయం, పగలు అనే తేడా లేకుండా చలి ప్రజలను బాధిస్తోంది. సింగిల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలితో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొమురం భీం జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా బేలాలో 9.9 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కుబీర్‌లో 10.9 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 11.2 డిగ్రీలు నమోదయ్యాయి.
కొమురం బీం జిల్లాలో అత్యల్పం
ఇక రాష్ట్రంలో అత్యల్పంగా కొమురం భీం జిల్లాలో నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.8 డిగ్రీలు, న్యాల్కల్‌లో 9.6 డిగ్రీలు, కంగ్టిలో 9.8 డిగ్రీలు, మోదక్ జిల్లా శివ్వంపేటలో 9.7 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రతతో ప్రజలు రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చలిమంటలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు చలికి ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. జిల్లా వాసులు ఈ పరిస్థితులను తట్టుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.