Weather Report : అల్పపీడనం ప్రభావం.. ఏపీలో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం ఈ అల్పపీడనం పశ్చిమ దిశగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతం నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని తాజా బులెటిన్ పేర్కొంది. ఈ ప్రభావంతో రాబోయే మంగళ, బుధ, గురువారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉంది.
తెలంగాణలో నవంబర్ 12 నుంచి తేలికపాటి వర్షాలు
వర్ష సూచన నేపథ్యంలో ఏపీ రైతులు వరికోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తెలంగాణలో నవంబర్ 12వ తేదీ నుంచి తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 11వ తేదీ వరకు తెలంగాణలో పొడి వాతావరణం ఉండగా, హైదరాబాద్‌లో ఉదయం పొగ మంచు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.