Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవి రేసులో లేనన్న ఏక్‌నాథ్ షిండే..ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై తాను రేసులో లేనప్పటికీ, చివరకు సీఎం కావడం ఖాయమని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికవుతానన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీపై కఠిన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలన విభజించి పాలించు విధానంపై విమర్శలు చేశారు. బాలాసాహెబ్ ఠాక్రే తాను ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేది లేదని చెబుతారని గుర్తుచేశారు. అయితే, ఉద్ధవ్ ఠాక్రే స్వార్థం కోసం మాత్రమే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని, ముఖ్యమంత్రి పదవిని సురక్షితం చేసుకోవడం కోసం బీజేపీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు అవసరం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడిస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లు అవసరం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడి కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మహాయుతిలో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే), మన్సే, ఆర్‌పీఐ సహా 8 పార్టీలుండగా, మహావికాస్ అఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)తో పాటు పలు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి.