Electoral bond: ఈసీఐ వెబ్‌సైట్‌లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం
ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగపర్చింది. సీల్డ్ కవర్‌లో రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఆ సీల్డ్ కవర్లను ఈసీఐ సుప్రీంకోర్టుకు అందజేయగా.. వాటిని బహిరంగ పర్చాలని ధర్మానసం ఆదేశించింది. దీంతో ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో భారత ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసింది. బాండ్ తేదీ, డినామినేషన్, బాండ్ సంఖ్య, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ, రసీదు తేదీ, క్రెడిట్ తేదీకి సంబంధించిన డేటాను ఈసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చింది?
పీటీఐ ప్రకారం.. బీజేపీ మొత్తం రూ.6,986.5 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను క్యాష్ చేసింది. 2019-20లో ఈ పార్టీకి గరిష్టంగా రూ.2,555 కోట్లు వచ్చాయి. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.656.5 కోట్లు పొందింది. కాంగ్రెస్ రూ.1,334 కోట్లు, బిజూ జనతాదళ్ (బీజేడీ) రూ.944.5 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ రూ.442.8 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రూ.1,397 కోట్లు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రూ.1,322 కోట్లు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రూ.181.35 కోట్లు వచ్చాయి. బాండ్ల విషయంలో ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ టాప్‌లో ఉండటం గమనార్హం.