అక్టోబర్ 3నుంచి తెలంగాణలో ఎన్నికల సంఘం బృందం పర్యటన
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఉన్నతాధికారుల బృందం పర్యటించనుంది. ఈ మేరకు అక్టోబర్ 3 నుంచి రాష్ట్రాన్ని ప్రత్యేకంగా సందర్శించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (తెలంగాణ సీఈఓ) వికాస్ రాజ్ వెల్లడించారు. 3 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఎన్నికల నిర్వహణ, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపనుంది. అంతేకాకుండా భాగస్వామ్య పక్షాలను, స్థానిక అధికారులతో ఎన్నికల సంఘం సమీక్షలు చేపట్టనుంది. తొలి రోజు : జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత తీరు తెన్నులపై భేటీ ఉండనుంది. రెండో రోజు : ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం సన్నద్ధతను సమీక్షించడంపై కీలకంగా దృష్టి కేంద్రీకరించనుంది.
పూర్తిస్థాయి నివేదిక తీసుకోనున్న భారత ఎన్నికల సంఘం
మూడో రోజూ : చివరి రోజున ఓటర్లను చైతన్య పరుస్తున్న తీరు, ఎన్నికల్లో ఓటర్లకు సంబంధించిన (ఎస్వీవీఈపీ) కార్యకలాపాలపై ప్రజెంటేషన్ ఉంటుంది. ఎన్నికల్లో పాల్గొనడంపై ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రచారం చేస్తున్న ప్రముఖులను, దివ్యాంగ ఓటర్లను, యువ ఓటర్లను బృందం కలవనుంది. సీఎస్, డీజీపీలతోనూ ఈ టీమ్ భేటీ అయ్యి రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగాన్ని, భద్రతా సంస్థలను సమన్వయ తీరును అంచనా వేయనుంది. 33 జిల్లాల ఎన్నికల అధికారులు (DEO), పోలీస్ సూపరింటెండెంట్ (SP), పోలీస్ కమీషనర్లు (CP)లు సీఈసీ బృందానికి వారి సన్నద్ధత నివేదికలను సమర్పించనున్నారని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు.