Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!
అధికార యంత్రాంగం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మూడు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేశామని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే తిరుపతి నుంచి కొండపైకి విద్యుత్ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్మాహాలు జరుగుతున్నాయి. విశాఖకు తొలి విడతలో 100 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) సిద్ధమవుతోంది. మలి విడతలో మరో 100 బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.
సిటీ సర్విసులుగానే ఎలక్ట్రిక్ బస్సులు
సిటీ సర్విసులుగానే ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. వీటికోసం సింహపురి, గాజువాక డిపోలను ఎపీఎస్ ఆర్టీసీ ఎంపిక చేసింది. సింహపురి, గాజువాక డిపోల్లో బస్సులకు అవసరమయ్యే ఛార్జింగ్ ఏర్పాట్లు చేయనున్నారు. బ్యాటరీ నడిచే ఈ బస్సులు గతంలో 150 కిలోమీటర్లు తిరగడానికి మాత్రమే ఛార్జింగ్ ఉండేది. ఇక నగర పరిధిలోని బస్సులు రోజుకు 250 నుంచి గరిష్టంగా 400 కిలోమీటర్ల వరకు తిరుగుతున్నాయి. తొలుత వచ్చే ఎలక్ట్రిక్ బస్సులు తక్కువ కిలోమీటర్ల రూటుల్లో తిప్పాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. విశాఖ నగర పరిధిలోని ఏడు డిపోల్లో ప్రస్తుతం 525 సిటీ బస్సులున్నాయి. డీజల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు అందుబాటులోకి వస్తే నగరంలో కాలుష్యాన్ని నివారించవచ్చు.