Electricity Department: వేసవికి విద్యుత్ శాఖ ముందస్తు సన్నాహాలు
ఈ వార్తాకథనం ఏంటి
వేసవి కాలం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారనుంది.
గ్రేటర్ పరిధిలో ప్రతి ఏడాది విద్యుత్ కనెక్షన్ల సంఖ్య పెరుగుతుండగా, ఈ ఏడాది మాత్రమే రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగే అవకాశముంది.
2024 డిసెంబర్ నాటికి గ్రేటర్‌లో మొత్తం 62.92 లక్షల కనెక్షన్లు నమోదయ్యాయి. 2023లో ఇవి 60.26 లక్షలు ఉండగా, ఏడాది చివరికి మరో 2 లక్షల కనెక్షన్లు పెరిగాయి.
ఈ పెరుగుదలతో విద్యుత్ సరఫరాకు తగిన ఏర్పాట్లు చేయడం డిస్కం కు పెద్ద సవాల్‌గా మారింది.
అందుకే నవంబర్‌లోనే దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రారంభించిన డిస్కం, సమ్మర్ సవాల్‌ను ఎదుర్కొనేందుకు ముందుగానే సిద్ధమైంది.
Details
విద్యుత్ డిమాండ్ 20-25శాతం పెరిగే అవకాశం
వేసవిలో గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. 2023లో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 3,756 మెగావాట్లు ఉండగా, 2024లో ఇది 16% పెరిగి 4,352 మెగావాట్లకు చేరుకుంది.
2023మేలో గరిష్ఠ విద్యుత్ వినియోగం 81.39 మిలియన్ యూనిట్లు కాగా, 2024లో ఇది 12శాతం పెరిగి 90.68 మిలియన్ యూనిట్లకు చేరింది.
ఈసారి అదనంగా 2 లక్షల కనెక్షన్లు పెరగడంతో వేసవిలో విద్యుత్ డిమాండ్ 20శాతం నుంచి 25శాతం వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
రోజుకు గరిష్ఠ డిమాండ్ 5,000 మెగావాట్లు ఉంటే, ఏడాది విద్యుత్ వినియోగం 100 మిలియన్ యూనిట్లను దాటే అవకాశముంది. ముఖ్యంగా గ్రేటర్ శివారు ప్రాంతాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది.
Details
ఈ నాలుగు నెలలు ముఖ్యం
ప్రస్తుతం చలి తగ్గి ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరుగుతోంది.
ఆసక్తికరంగా, ఈ ఏడాది జనవరిలోనే విద్యుత్ వినియోగం గతేడాది మార్చి నెల వినియోగాన్ని దాటేసింది.
ఉదాహరణకు, 2024 జనవరి 31న గరిష్ఠ డిమాండ్ 3,334 మెగావాట్లు కాగా, 2023 మార్చి 31న ఇది 3,018 మెగావాట్లుగా ఉంది.
గత అనుభవాలను పరిశీలిస్తే, విద్యుత్ వినియోగం మార్చి నుంచి పెరిగి ఏప్రిల్-మే నెలల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుంది.
అందువల్ల ఈ నాలుగు నెలలు కీలకమని, రికార్డు స్థాయిలో డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
Details
సదుపాయాల విస్తరణ, బలోపేతం
విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవసరానికి తగ్గట్టుగా 220/132/33 కేవీ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయడం, నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నారు.
కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు, కొత్తగా అభివృద్ధి అవుతున్న కాలనీల్లో ఇండ్ల నిర్మాణాలు, పట్టణ విస్తరణ కారణంగా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండటం, తద్వారా డిమాండ్ ఎక్కువవుతున్నదని అధికారులు తెలిపారు.
వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని టీజీ ఎస్‌ఎన్‌డీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ బాధ్యతను ఎస్‌ఈలు చేపట్టాలని సూచించారు.