Page Loader
AP Employee unions:  ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు..! 
ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు..!

AP Employee unions:  ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,ఆర్టీసీ వర్గాలు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. తమ హక్కులు,బకాయిలు, ప్రమోషన్ల వంటి అంశాల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోకపోతే, తీవ్ర స్థాయిలో ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేస్తున్నాయి. నెల ప్రారంభంలోనే జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ,అదే సమయంలో అనేక వర్గాలు తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటించాయి. ఏపీజేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ,ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించడం లేదని, గత ఏడాది నుంచి ఓపిగ్గా ఎదురుచూస్తున్నామన్న ఆక్రోశం వ్యక్తం చేశారు. జగన్నాథ రథచక్రాలు వంటి ప్రభుత్వ యంత్రాంగం,ఉద్యోగుల వంక తిరిగి చూడడం లేదని పేర్కొంటూ, ఇప్పుడు ఆ యంత్రాంగం ఉద్యోగుల వైపు దృష్టి సారించాలని కోరుతున్నారు.

వివరాలు 

ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు ఉధృతం 

పీఆర్సీ సవరణ అంశంపై గత రెండేళ్లుగా కమిషనర్‌ను నియమించకపోవడం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు గేట్‌మీటింగ్‌లు, ధర్నాలు చేపట్టడం ప్రారంభించారు. పీఆర్సీ, డీఏలు, సారెండర్ లీవ్‌ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం,ప్రమోషన్లు రాకపోవడం కారణంగా ఉద్యోగ సంఘాలు నిరసన బాటలో నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 129 డిపోలతో పాటు 4 వర్క్‌షాప్‌లలో ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆర్టీసీ ఈయూ ఆధ్వర్యంలో అన్ని డిపోల వద్ద నిరసనలు జరుగుతున్నాయి.

వివరాలు 

ఆగస్టు 15 నుంచి మహిళల ఉచిత ప్రయాణ పథకం

ముఖ్యమంత్రిపై ఆధారపడి ఉన్న ప్రమోషన్లకు వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వచ్చే ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళల ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే, రాష్ట్ర ప్రభుత్వం కనీసం 3,000 కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, అలాగే 10,000 మందికిపైగా సిబ్బందిని నియమించాలనే డిమాండ్లు తెరపైకి తెచ్చారు. పీఆర్సీ బకాయిల చెల్లింపును కూడా వారు కోరుతున్నారు.

వివరాలు 

పెన్షనర్లు, పంచాయతీ కార్యదర్శుల ఆవేదన 

పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీఎన్జీజీజీవో సహకారంతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. గ్రీన్ అంబాసిడర్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడం, వారిని పని చేయించాలంటే అదనంగా డబ్బులు ఇవ్వాల్సి రావడం వంటి పరిస్థితులను వారు తిప్పి చెబుతున్నారు. అలాగే, తమ పదోన్నతుల విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలని, పట్టించుకోకపోతే నిరసన బాట తప్పదని హెచ్చరిస్తున్నారు. తమ సంపాదనను తిరిగి అడుగుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం తప్పదని స్పష్టం చేశారు.

వివరాలు 

ఊపందుకుంటున్న ఉద్యమ మంట 

ప్రస్తుతం ఏపీలో ఉద్యోగ వర్గాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చి తమ డిమాండ్లను సాధించుకునే దిశగా కదులుతున్నాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించేందుకు రెండు నెలల గడువు ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో, తదుపరి పరిణామాలు ఏవిధంగా కొనసాగతాయో వేచి చూడాలి.