
Encounter: జమ్ముకశ్మీర్'లో ఎన్‌కౌంటర్..తృటిలో తప్పించుకున్న ఉగ్రవాదులు..సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన భద్రతా దళాలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో గురువారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉగ్రవాద నిర్మూలన ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.
రాజ్‌బాగ్ సమీపంలోని ఘాటి జుతానా ప్రాంతంలో ఉదయం భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఎదురుకాగా, కొద్దిసేపు తీవ్రమైన కాల్పులు జరిగాయని వెల్లడించారు.
అనంతరం పరిస్థితిని పరిశీలించి అదనపు బలగాలను సంఘటన స్థలానికి తరలించినప్పటికీ, ఉగ్రవాదులు స్వల్ప సమయంలోనే తప్పించుకున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ ఎదురుకాల్పులపై తాజా సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు తెలిపారు.
వివరాలు
తప్పించుకున్న ఉగ్రవాదుల గ్రూపే మళ్లీ తారసపడింది
ఇంతకుముందు, మార్చి 23 సాయంత్రం కథువా జిల్లాలోని హిరానగర్ సెక్టార్‌లో జరిగిన ఎదురుకాల్పుల సమయంలో తప్పించుకున్న ఉగ్రవాదులే మళ్లీ భద్రతా దళాలకు ఎదురయ్యే అవకాశముందంటున్నారు.
ఆ ఘటనలో ఉగ్రవాదులు అంతర్జాతీయ సరిహద్దును దాటి దట్టమైన అడవిలోకి చొరబడగా, భద్రతా దళాలు వారికి ప్రతిఘటించాయి.
ఇరువర్గాల మధ్య దాదాపు అరగంట పాటు కాల్పులు కొనసాగినప్పటికీ, ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకోవడానికి సమర్థమయ్యారని ఆర్మీ అధికారులు తెలిపారు.
2024లో జమ్ము ప్రాంతంలో జరిగిన వరుస దాడులు, ఎదురుకాల్పుల కారణంగా ఇప్పటివరకు 18 మంది భద్రతా సిబ్బంది, 13 మంది ఉగ్రవాదులు సహా మొత్తం 44 మంది మరణించారు.