
Jammu Kashmir: ఆక్నూర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ జేసీవో వీరమరణం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని అక్నూర్ సెక్టార్‌లో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. నియంత్రణ రేఖ (LOC) దగ్గర శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో భారత ఆర్మీకి చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం మేరకు, కేరీ బత్తల్ ప్రాంతంలో ఒక నదికి సమీపంలో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.
అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారి కదలికల్ని గుర్తించి వెంటనే ఎదురు కాల్పులకు దిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మొదటగా గాయపడ్డ JCO, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు సమాచారం.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని భద్రతా దళాలు పూర్తిగా కార్డన్ చేసి, ఉగ్రవాదుల కోసం శోధన ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
Details
ఫిబ్రవరి 11న భారీ ఎన్‌కౌంటర్
ఇదే అక్నూర్ సెక్టార్‌లో ఫిబ్రవరి 11న కూడా ఎన్‌కౌంటర్ జరిగింది. ఆ ఘటనలో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఉగ్రవాదులు అమర్చిన IED పేలుడు కారణంగా ఓ ఆర్మీ కెప్టెన్ మరణించారు.
ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఇండియా-పాక్ బ్రిగేడియర్ స్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.
సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఆ సమావేశం ఏర్పాటు చేసినా, వెంటనే ఎదురుకాల్పులు జరగడం గమనార్హం.
సమావేశంలో భారత సైన్యం, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్ర కార్యకలాపాలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలు పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది.