Kashmir Encounter: కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు సైనికులు వీరమరణం
జమ్ముకశ్మీర్‌లోని కిష్టవార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు కథువాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో రైజింగ్ స్టార్ కార్ప్స్ యూనిట్ ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. కిష్టవార్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందింది. వెంటనే చాట్రూ ప్రాంతంలో ఆపరేషన్ చేపట్టినట్టు ఆర్మీ పేర్కొంది. ఈ ఎన్‌కౌంటర్ మధ్య 15:30 గంటల సమయంలో ఉగ్రవాదుల ఆచూకీ లభించిందని, జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సైనికులు మరణించారని ఆర్మీ ధ్రువీకరించింది. ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
శాంతిభద్రతలకు ఆటంకం ఏర్పడే అవకాశం
కిష్టవార్ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న ఉగ్రవాదులే జూలైలో దోడా ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్నట్లు అనుమానాలు ఉన్నాయి. దోడాలో జరిగిన ఆ ఎన్‌కౌంటర్‌లో నలుగురు సైనికులు మరణించిన సంగతి తెలిసిందే . కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్ల వల్ల శాంతిభద్రతల సమస్యలు పెరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు 18న దోడా, కిష్టవార్, రాంబన్, అనంతనాగ్, పుల్వామా, సోఫియాన్, కుల్గామ్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సైతం జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం.