
Mining: గనుల శాఖలో 'ఫెసిలిటేషన్ సెల్' ఏర్పాటు.. పారదర్శక లీజులకు గ్రీన్‌సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజ రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు గనుల శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ఖనిజాల రాయల్టీ (సీనరేజి ఫీజు) చెల్లింపులు, చిన్న తరహా ఖనిజాల వేలంపట్ల పలు మార్పులు చేసింది. షెడ్యూల్-1లోని 14 రకాల ఖనిజాలు, షెడ్యూల్-3లోని 27 రకాల చిన్న తరహా ఖనిజాలకు సంబంధించి టన్నుకు 20శాతం వరకు ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో గ్రానైట్ ఫీజు టన్నుకు రూ.65 నుంచి రూ.78కి పెరిగింది. అలాగే గుట్టల ద్వారా తవ్వే మొరాన్ని టన్నుకు రూ.20 నుంచి రూ.26కు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా 2,063 మైనింగ్ క్వారీలను లీజుకు ఇచ్చిన ప్రభుత్వం, వాటి ద్వారా సంవత్సరానికి సుమారు రూ.1,600 కోట్ల ఆదాయం పొందుతోంది.
Details
వేలం ప్రక్రియలో మార్పులు
తాజా సీనరేజి ఫీజుల పెంపుతో ఇంకా రూ.320 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. చిన్న తరహా ఖనిజాల వేలం ప్రక్రియలోనూ గనుల శాఖ సంస్కరణలు చేపట్టింది. తాజా మార్పుల ప్రకారం, వేలంలో గెలిచిన బిడ్డర్ 7 రోజుల్లోపు 25శాతం ఫీజు చెల్లించాలి. బిడ్డర్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే అతడి హక్కు రద్దు చేసి రెండో అత్యధిక ధరకు వేలం వేశారని ప్రకటించిన బిడ్డర్‌కు అవకాశం ఇస్తారు. ఈప్రక్రియల్లో పూర్తి పారదర్శకత కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక 'ఫెసిలిటేషన్ సెల్'ను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవలి చిన్న ఖనిజాల వేలం ద్వారా ప్రభుత్వం రూ.56.74 కోట్ల ఆదాయాన్ని పొందింది. ఇలాంటి బ్లాకుల సంఖ్యను పెంచితే, రాష్ట్రానికి మరింత ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
Details
ఓటీఎస్‌కు స్పందన లేకపోతే చర్యలు
ఇక ఖనిజాల అక్రమ తవ్వకాలపై విధించిన జరిమానాల చెల్లింపునకు 'వన్ టైమ్ సెటిల్‌మెంట్' (ఓటీఎస్) పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టినా చాలామంది లీజుదారులు స్పందించకపోవడంతో చర్యలకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో 180కి పైగా క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిగాయి. ఇందుకు సంబంధించి సదరు లీజుదారులకు సీనరేజి ఫీజుకు కనీసం 5 నుంచి 10 రెట్లు అధికంగా జరిమానాలు విధించారు. అయితే వీరికి ఓటీఎస్ ద్వారా అవకాశం కల్పించినా చాలామంది పట్టించుకోకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ చర్యలన్నీ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడమే కాకుండా గనుల నిర్వహణలో నియంత్రణ, పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయి.