Rain Alert : తుపాను ప్రభావం తగ్గినా వర్షాలు తగ్గలేదు.. మరో రెండు రోజులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక!
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాన్ ప్రభావం తగ్గిపోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అయితే వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, తెలంగాణలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం వర్షాలకు కొంత విరామం లభించినప్పటికీ, ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. రానున్న 48 గంటల్లో తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఆదివారం సాయంత్రం, రాత్రి వేళల్లో చెదురుమదురు వర్షాలు పడతాయని సూచించింది.
Details
మోస్తరు వర్షాలు పడే అవకాశం
ఈరోజు (ఆదివారం) సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. అదేవిధంగా, హైదరాబాద్‌లోనూ రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో తెలంగాణలో నమోదైన వర్షపాతం గత 10 ఏళ్లలో అత్యధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాల మాదిరిగానే అక్టోబర్ నెలలోనూ రికార్డు స్థాయిలో వర్షాలు నమోదయ్యాయి.
Details
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 90.6 మిల్లీమీటర్లు ఉండగా, ఈసారి 353.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై మూడు రెట్లు అధికంగా రికార్డు సృష్టించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అలాగే రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చని వివరించారు. ఈ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.