
PM Modi: 'దేశ రక్షణలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి'.. మన్‌కీ బాత్‌లో మోదీ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే పోరాటంలో భారత దళాలు చూపిన ధైర్యసాహసాలు దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
ఆదివారం ప్రసారమైన 122వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా మోదీ ఈ కార్యక్రమంలో మాట్లాడారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
మన జవాన్లు చూపిన అపార ధైర్యం ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రెట్టింపుచేసింది. ఈ ఘటన అనేక కుటుంబాలను ప్రభావితం చేసింది.
Details
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమొత్తం ఏకమైంది
ఆపరేషన్ జరిగిన సమయంలో జన్మించిన శిశువులకు పలువురు 'సిందూర్' అనే పేరును పెట్టడం అనేది స్ఫూర్తిదాయకం.
దేశం మొత్తం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒకటై నిలిచింది. ఇప్పుడు ప్రతి భారతీయుడు దేశ రక్షణలో తన వంతు భాగస్వామ్యం కోరుకుంటున్నాడని ప్రధాని పేర్కొన్నారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదు, అది ధైర్యానికి, దేశభక్తికి నిలువెత్తు ఉదాహరణగా మోదీ అభివర్ణించారు.
అనేక గ్రామాలు, పట్టణాల్లో తిరంగ యాత్రలు నిర్వహించబడటంతోపాటు, పౌర రక్షణ వాలంటీర్లుగా యువత ముందుకు రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాలపై కూడా మాట్లాడారు.
Details
దేశం గర్వించే స్థాయిలో విజయం సాధించింది
"నక్సలిజానికి వ్యతిరేకంగా దేశం గర్వించే స్థాయిలో విజయం సాధించింది.
దంతెవాడ ఆపరేషన్‌లో జవాన్లు చూపిన సాహసం అభినందనీయం. మావోయిస్టుల హింస గతంలోతో పోలిస్తే గణనీయంగా తగ్గిందని తెలిపారు.
అంతేకాదు, తెలంగాణలో సంగారెడ్డి మహిళలు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం ద్వారా సాధిస్తున్న అభివృద్ధిని ప్రధాని ప్రస్తావించారు.
"ఈ మార్పు గమనించదగ్గది. ఆధునిక సాంకేతికతను అపూర్వంగా వినియోగిస్తూ దేశ వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర పెరుగుతోందని మోదీ ప్రశంసించారు.
ఈ మన్ కీ బాత్ ప్రసంగం మొత్తం దేశ భద్రత, దేశభక్తి, సామాజిక భాగస్వామ్యం, సాంకేతిక అభివృద్ధి అనే నాలుగు దిశలపై దృష్టి పెట్టినదిగా నిలిచింది.