Page Loader
Free health insurance: 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త.. కేబినెట్ ఆమోదం..
70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త

Free health insurance: 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మోడీ శుభవార్త.. కేబినెట్ ఆమోదం..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 12, 2024
08:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.

వివరాలు 

4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం 

మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ, వారి సామాజిక లేదా ఆర్థిక స్థితి పక్కన పెట్టి, ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) ద్వారా లబ్ధి పొందగలరని ప్రభుత్వ ప్రకటనలో తెలిపారు.

వివరాలు 

ఆరోగ్య బీమా ఎలా పొందాలి? 

ఆయుష్మాన్ భారత్ (AB PM-JAY) కింద 70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక కార్డు అందించబడుతుంది. ఇప్పటికే ఈ పథకం పరిధిలో ఉన్నవారికి, వారి కుటుంబంలో ఉన్న సీనియర్ సిటిజన్లకు ఏటా రూ.5 లక్షల అదనపు టాప్-అప్ లభిస్తుంది. ఇతర ఆరోగ్య బీమా పథకాల కింద ప్రయోజనాలు పొందుతున్న వారు, తమ ప్రస్తుత పథకాలను కొనసాగించవచ్చు లేదా ఈ పథకంలో కవరేజీని ఎంచుకోవచ్చు.

వివరాలు 

ఆయుష్మాన్ భారత్ పథకం ఏమిటి? 

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య భరోసా పథకంగా ఉంది. సెకండరీ, తృతీయ కేర్ ఆసుపత్రి సేవలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య కవరేజీ అందిస్తుంది. 12.34 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి, వయస్సుతో సంబంధం లేకుండా, ఈ పథకం లభిస్తుంది. ప్రస్తుతం 7.37 కోట్ల ఆసుపత్రి అడ్మిషన్లు ఈ పథకం కింద జరగగా, లబ్ధిదారుల్లో 49 శాతం మంది మహిళలు ఉన్నారని ప్రకటించారు. ఈ ఆరోగ్య పథకం ద్వారా ఇప్పటివరకు ప్రజలకు రూ.1 లక్ష కోట్లకుపైగా ప్రయోజనం అందింది.