Manipur: మణిపుర్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై 'పార్టీ హైకమాండ్‌దే నిర్ణయం': బీజేపీ ఎమ్మెల్యేలు!
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొన్ని నెలలుగా అక్కడ చోటుచేసుకుంటున్న అల్లర్ల నేపథ్యంలో,రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఫిబ్రవరి 9న బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి,ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇంఛార్జి సంబిత్ పాత్రా ఇంఫాల్‌లోనే మకాం వేయడంతో పాటు, వివిధ నేతలతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్‌లతో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణపై చర్చిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు సపమ్ కెబా,ఇబోమ్‌ఛా ఓ హోటల్‌లో సంబిత్ పాత్రాను కలిసి, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించారు.
వివరాలు
మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు తగిన చర్యలు
ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో ఎమ్మెల్యేలు మాట్లాడారు.
మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు వెల్లడించారు.
కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై మీడియా ప్రశ్నించగా, "పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని సంబిత్ పాత్రా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. సీఎం ఎంపికకు గడువు గురించి ఇంకా ఎలాంటి చర్చ జరగలేదు," అని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
వివరాలు
మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు భేటీలు
రాష్ట్రంలో కొనసాగుతున్న జాతి హింసను అరికట్టేందుకు, బీజేపీ నేత సంబిత్ పాత్రా సోమవారం రాష్ట్ర భద్రతా సలహాదారు కుల్దీప్ సింగ్, హిల్ ఏరియాస్ కమిటీ ఛైర్మన్ డి. గంగ్మేయ్‌లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు.
మరోవైపు, మణిపుర్ బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం.
మణిపుర్‌లో కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులైన విషయం తెలిసిందే.