
AP Liquor Scam: అన్నీ ఆ ముఠానే చేసిందే.. నాకు అధికారమే లేదు.. రజత్ భార్గవ వాంగ్మూలం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) కేంద్రంగా జరిగిన భారీ మద్యం కుంభకోణంపై కీలకంగా మారిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) శుక్రవారం విచారించింది. వైసీపీ పాలనలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎనిమిది గంటలపాటు విచారణ సాగింది. ఇందులో 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. విచారణలో రజత్ భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. బెవరేజెస్ సంస్థలో జరిగే ఉల్లంఘనలపై అప్పటి మేనేజింగ్ డైరెక్టర్లకు తాను ఎప్పటికప్పుడు మెమోలు జారీ చేశానని, కానీ అవేవీ ఎవరూ పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది.
Details
సరైన సమాధానం లేవు
అంతేకాదు నాకు అధికారమే ఉండేది కాదు.. అన్నీ ఆ ముఠాయే నడిపించేది అని చెప్పినట్టు సమాచారం. విచారణలో ఎక్సైజ్ శాఖ జీవోలను ఏపీఎస్‌బీసీఎల్ ఎలా పట్టించుకోలేదన్న అంశంపై ప్రశ్నించగా జీవో అమలుకు తాను బాధ్యుడి కాదని, అది APSBCL పరిధిలోకి వస్తుందని ఆయన సమాధానమిచ్చారు. రాయితీ విధానాల్లో పదేపదే మార్పులు చేయడంపై అడిగితే కూడా సరైన స్పష్టత ఇవ్వలేదని సమాచారం. మీ నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.200 కోట్ల నష్టం వాటిల్లింది కదా? అనే ప్రశ్నపై మాత్రం, దానికి బాధ్యులైనవారి నుంచి వివరణ తీసుకోవాలని ఆయన సూచించినట్టు తెలుస్తోంది.
Details
జారీ చేసిన జీవోలు, మెమోలు ఆధారంగా ప్రశ్నలు
రజత్ భార్గవ జారీ చేసిన కొన్ని జీవోలు, మెమోలు రాజ్ కెసిరెడ్డి మద్యం ముఠాకు మేలు కలిగించేలా ఉన్నాయని ఆరోపణలతో SIT అధికారులు వాటిపై గమనించి ఆయనను ప్రశ్నించారు. వాటిలోని అంశాల ఆధారంగా సూటిగా ప్రశ్నలు సంధించారు. SIT అధికారులు ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. శనివారం కూడా ఆయన్ను మళ్లీ విచారించే అవకాశముందని తెలుస్తోంది.
Details
ఆమె నియమాకంపై నాకు సంబంధం లేదు
APSBCలోని ఎంఐఎస్ విభాగంలో అనూష అనే మహిళను డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా నియమించడం వెనుక ఉన్న మతలబు ఏమిటని అడిగితే అది అప్పటి ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాల మేరకే చేశానని సమాధానమిచ్చినట్టు సమాచారం. అయితే ఆమె రాజ్ కెసిరెడ్డి ముఠాకు డేటా పంపుతుందన్న ఆరోపణలపై మాత్రం ఆమె ఎండీ పరిధిలో పని చేసేది.. ఈ విషయం నాకు తెలియదని తప్పించుకునేలా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంతటి పెద్ద కుంభకోణం జరుగుతుంటే.. ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఎవరి ఆదేశాలకు లోబడి అంగీకరించారా? అనే కోణాల్లో అడిగిన ప్రశ్నలకు మాత్రం రజత్ భార్గవ కొన్ని సందర్భాల్లో తేలికగా తప్పించుకునేలా స్పందించారని తెలిసింది. మొత్తం మీద, విచారణలో ఆయన పలు విషయాలను వెల్లడించినట్టు సమాచారం.