Killi Kruparani: వైసీపీకి భారీ షాక్...మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి రాజీనామా
లోక్‌సభ ఎన్నికలకు ముందు వైసీపీ కి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి భారీ షాక్ ఇచ్చారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదన్న కారణాన్ని చూపుతూ శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను బుధవారం ఏపీ సీఎం వై.ఎస్.జగన్ కు పంపించారు. కాగా, కిల్లి కృపారాణి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆమె కుమారుడు విక్రాంత్ కు కాంగ్రెస్ తరఫు టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇక కృపారాణి శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువు కిల్లి కృపారాణి
ఉత్తరాంధ్రలో కీలక మహిళా నేతగా ఉన్న కిల్లి కృపారాణికి వైసీపీలో తగినంత ప్రాధాన్యత లభించలేదు. వాస్తవానికి 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అనంతరం కేంద్రమంత్రి పదవిని కూడా దక్కించుకుని శ్రీకాకుళం జిల్లా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. తదనంతర పరిణామాలతో వైసీపీలోకి చేరిన కిల్లి కృపారాణిని జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా నియమించింది. రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పిస్తామని చెప్పిన వైసీపీ నేతలు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆమె సారీ చెబుతూ మిగతావారికి రాజ్యసభ ఎంపీగా చాన్స్ ఇచ్చారు. దీంతో ఎప్పట్నుంచో వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న కిల్లి కృపారాణి తాజాగా ఆ పార్టీ కి రాజీనామా ఇచ్చారు.