CACP Report: ఏపీ జిల్లాల్లో ఎరువుల మోతాదు ప్రమాదకరం.. సీఏసీపీ ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో రసాయన ఎరువుల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్ వెల్లడించింది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు కనీస మద్దతు ధరలపై కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ విషయాలను స్పష్టం చేసింది. ముఖ్యంగా విశాఖపట్టణం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాల్లో ఎరువుల వినియోగం ప్రపంచంలో అత్యధికంగా ఎరువులు వాడే కొన్ని దేశాల కంటే ఎక్కువగా నమోదైనట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం హెక్టార్‌కు సగటున 150 కిలోల ఎన్‌పీకే ఎరువులు వినియోగిస్తున్నారని కమిషన్ పేర్కొంది. బంగ్లాదేశ్‌లో 349 కిలోలు,చైనాలో 373 కిలోలు,వియత్నాంలో 276 కిలోల వినియోగం ఉన్నప్పటికీ,ఏపీ జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత అధికంగా ఉందని వివరించింది.
వివరాలు
ముడిసరకుల కోసం విదేశీ దిగుమతులపై ఆధారం
విశాఖపట్నం జిల్లాలో హెక్టార్‌కు 1,405 కిలోలు,పశ్చిమగోదావరిలో 996 కిలోలు,తూర్పుగోదావరిలో 598 కిలోలు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 561 కిలోల ఎరువులు వాడుతున్నట్లు వెల్లడించింది. భారత ఎరువుల రంగం ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటోందని కమిషన్ తెలిపింది. భారీ స్థాయిలో సబ్సిడీ భారం పడుతున్నదని, ప్రస్తుతం ఇది రూ.1.86లక్షల కోట్లకు చేరిందని పేర్కొంది. అలాగే ఎరువుల తయారీకి అవసరమైన ముడిసరకుల కోసం విదేశీ దిగుమతులపై అధికంగా ఆధారపడాల్సి వస్తోందని వివరించింది. ఈ పరిస్థితుల్లో కొందరు ఆర్థిక నిపుణులు ఎరువుల సబ్సిడీని పూర్తిగా తొలగించాలని, లేదంటే ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారని తెలిపింది. అయితే ఎరువుల వినియోగాన్ని ఒక్కసారిగా తగ్గిస్తే వ్యవసాయ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని కమిషన్ అభిప్రాయపడింది.
వివరాలు
ఎరువుల పంపిణీని పర్యవేక్షణకీ కమిషన్ సూచన
అందుకే ఎరువుల అమ్మకాలను భూవిస్తీర్ణం, పంటల విధానంతో అనుసంధానం చేయాలని సూచించింది. అగ్రిస్టాక్ వంటి డిజిటల్ వేదికలను ఉపయోగించి ఎరువుల పంపిణీని పర్యవేక్షించాలని కమిషన్ సూచించింది. దీని ద్వారా అధిక, అసమతౌల్య ఎరువుల వినియోగాన్ని నియంత్రించడంతో పాటు సబ్సిడీ భారం కూడా తగ్గించవచ్చని పేర్కొంది. అదే సమయంలో వ్యవసాయ ఉత్పాదకత దెబ్బతినకుండా కాపాడవచ్చని తెలిపింది. మిగతా ఎరువులతో పోలిస్తే యూరియాపై అధిక సబ్సిడీ ఇవ్వడం వల్ల అసమతౌల్య వినియోగం పెరుగుతోందని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పంటల సాగు విధానంలో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో నత్రజని, భాస్వరం, పొటాషియం 4:2:1 నిష్పత్తిని కూడా మళ్లీ సమీక్షించాల్సిన అవసరం ఉందని సూచించింది.
వివరాలు
కేంద్ర నిల్వల అంశంపై సీఏసీపీ కీలక వ్యాఖ్యలు
ఇక కేంద్ర నిల్వల అంశంపై కూడా సీఏసీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర పూల్‌లో బియ్యం నిల్వలు భారీగా పేరుకుపోయినట్లు తెలిపింది. ప్రతి ఏడాది జనవరి 1 నాటికి 7.61 మిలియన్ టన్నుల బియ్యం నిల్వలు ఉండాల్సి ఉండగా, 2026 జనవరి చివరినాటికి అవి 33.7 మిలియన్ టన్నులకు చేరినట్లు వెల్లడించింది. గోధుమల నిల్వలు కూడా 13.8 మిలియన్ టన్నుల స్థాయి దాటుకుని 25.6 మిలియన్ టన్నులకు చేరినట్లు తెలిపింది. కొవిడ్ తర్వాత జాతీయ ఆహార భద్రత చట్టం,ఇతర సంక్షేమ పథకాల అమలు,బహిరంగ మార్కెట్‌లో ధాన్యం అమ్మకాలను తగ్గించడం వల్లే నిల్వలు పెరిగాయని కమిషన్ పేర్కొంది. గతంలో 30మిలియన్ టన్నుల వరకు జరిగిన బహిరంగ అమ్మకాలు ప్రస్తుతం 20.4మిలియన్ టన్నులకు పడిపోయాయని వివరించింది.
వివరాలు
భారీగా పడిపోయిన మొక్కజొన్న ధరలు
రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడులు రావడం,బహిరంగ సేకరణ విధానం కొనసాగడం,కొన్ని రాష్ట్రాలు అదనపు ప్రోత్సాహకాలు ప్రకటించడం వల్ల కూడా బియ్యం నిల్వలు పెరుగుతున్నాయని తెలిపింది. నిల్వలను తగ్గించేందుకు కేంద్రం 5.2 మిలియన్ టన్నుల బియ్యాన్ని రాయితీ ధరకు ఇథనాల్ తయారీకి కేటాయించినట్లు వెల్లడించింది. దీనివల్ల మొక్కజొన్న ధరలు భారీగా పడిపోయాయని పేర్కొంది. అయినా బియ్యం నిల్వలు ఇంకా అధికంగానే ఉండటంతో గోదాముల సామర్థ్యంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని కమిషన్ తెలిపింది.
వివరాలు
లెవీల విధానాలపై కేంద్రం పునరాలోచన చేయాలి
రాబోయే సీజన్‌లో కూడా రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, మరోవైపు ఎగుమతులు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈ పరిస్థితులు భవిష్యత్తులో బియ్యం ధరలు తగ్గే అవకాశాలకు దారితీయవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బహిరంగ ధాన్యం సేకరణ విధానాన్ని పూర్తిస్థాయిలో పునఃసమీక్షించాలని సీఏసీపీ సూచించింది. ముఖ్యంగా కనీస మద్దతు ధరపై అదనపు బోనస్‌లు చెల్లించడం, పన్నులు, లెవీల విధానాలపై కేంద్రం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.