China-Russia: అమెరికా ఆధిపత్యానికి చెక్.. బహుధ్రువ ప్రపంచానికి చైనా-రష్యా మద్దతు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనం పెరుగుతుండడంపై చైనా,రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఒక్క దేశం ప్రపంచాన్ని తన ఇష్టప్రకారం నడపడం సరైంది కాదని, ప్రపంచ వ్యవస్థ బహుధ్రువ విధానంలో కొనసాగాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. ఈ దిశగా ఇద్దరు నేతలు కలిసి 'బహుధ్రువ ప్రపంచ ప్రకటన'పై సంతకాలు చేశారు. అమెరికా ఆధిపత్య ధోరణిని ఎదుర్కొనేందుకు దీర్ఘకాలంగా పరస్పరం సహకరించుకుంటామని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇటీవలే ఆతిథ్యం ఇచ్చిన జిన్‌పింగ్.. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు బీజింగ్‌లో ఘన స్వాగతం పలికారు. ప్రపంచ అధికారాలు కొన్ని దేశాల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు పేర్కొన్నారు.
వివరాలు
చరిత్రాత్మక అవకాశాన్ని ఒడిసిపట్టే ప్రతిజ్ఞ
ప్రపంచ వ్యవహారాలను కొన్ని దేశాలు తమ ఆధీనంలో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయని, తమ అభిప్రాయాలను ఇతర దేశాలపై రుద్దాలని చూస్తున్నాయని సంయుక్త ప్రకటనలో విమర్శించారు. ఇతర దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధిని అడ్డుకునే చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. చైనా-రష్యా సంబంధాలు పరస్పర గౌరవం, సమానత్వం, నమ్మకం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రపంచంలో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య చరిత్రాత్మక అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. పాశ్చాత్య దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని జిన్‌పింగ్ విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రపంచ చరిత్రను తిరగరాసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్యల వల్ల ప్రపంచానికి తీవ్ర నష్టం జరుగుతోందని,పరిస్థితులు మళ్లీ ఆటవిక స్థితికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
వివరాలు
పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలి: జిన్‌పింగ్
'ఒకే చైనా' విధానానికి రష్యా సంపూర్ణ మద్దతు ఇస్తుందని పుతిన్ తెలిపారు. తైవాన్ చైనాలో విడదీయరాని భాగమని, దానికి ఎలాంటి స్వతంత్ర హోదాను అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రపంచ పాలన వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో వాణిజ్యం, సాంకేతికతతో పాటు పలు రంగాల్లో చైనా-రష్యా మొత్తం 20 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై కొనసాగిస్తున్న దాడులను చైనా, రష్యా ఖండించాయి. ఈ చర్యలు అక్రమమని, పశ్చిమాసియా ప్రాంత స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ప్రతిపాదించిన 'గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ'పై కూడా ఇరుదేశాలు విమర్శలు గుప్పించాయి. ఈ వ్యవస్థ అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాయి.
వివరాలు
పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలి: జిన్‌పింగ్
సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలకు ఆటంకాలు కల్పించడం ప్రపంచ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు వెంటనే ముగింపు పలకాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పుతిన్‌తో సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సంక్షోభం అత్యంత కీలక దశకు చేరుకుందని పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతం, పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత విస్తరించకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి చర్చల ద్వారానే ముందుకు వెళ్లాలని సూచించారు. ఘర్షణలు త్వరగా ముగిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో ఏర్పడుతున్న అంతరాయాలు తగ్గే అవకాశముందని తెలిపారు.
వివరాలు
చైనా-రష్యా ఒప్పందాన్ని పొడిగించేందుకుఅంగీకారం
ప్రపంచ పాలన మరింత న్యాయబద్ధంగా, సమతుల్యంగా ఉండేలా చైనా-రష్యా కలిసి పనిచేస్తాయని జిన్‌పింగ్ చెప్పారు. జిన్‌పింగ్‌ను తన అత్యంత సన్నిహిత మిత్రుడిగా పుతిన్ అభివర్ణించారు. దాదాపు పాతికేళ్ల క్రితం కుదిరిన చైనా-రష్యా ఒప్పందాన్ని మరింత కాలం పొడిగించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి.