Jharkhand: హేమంత్ సోరెన్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 11 మంది ప్రమాణం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇటీవల కేబినెట్‌ను విస్తరించారు. ఈ సందర్భంగా గురువారం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో జేఎంఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. కొత్త కేబినెట్‌లో హేమంత్ సోరెన్‌తో కలిసి మొత్తం ఏడుగురు జేఎంఎం సభ్యులు ఉన్నారు. కొత్తగా చేరిన మంత్రుల్లో జేఎంఎంకు చెందిన స్టీఫెన్ మరాండీ, రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, కాంగ్రెస్‌కు చెందిన రాధా కృష్ణ కిషోర్, దీపికా పాండే సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఈ కేబినెట్‌లో కొత్తవారికి మాత్రమే హేమంత్ అవకాశం ఇచ్చారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సంతోష్ గంగ్వార్ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు.
జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా సోరెన్
నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికలలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి భారీ విజయాన్ని సాధించింది. రాష్ట్రంలోని 81 అసెంబ్లీ స్థానాల్లో జేఎంఎం 34 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ(ఎంఎల్) రెండు, అలాగే ఏజేఎస్‌యూపీ, లోక్ జనశక్తిపార్టీ, జేఎల్‌కేఎం, జేడీయూలు ఒక్కో స్థానంలో విజయం సాధించాయి. నవంబర్ 28న హేమంత్ సోరెన్ జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్వార్ హేమంత్‌తో ప్రమాణం చేయించారు. ఆ రోజు హేమంత్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారానికి హాజరైన ఇండియా కూటమి నేతలు
ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారిలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దంపతులు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితరులు ఉన్నారు.