
Supreme Court: ఇప్పటికే మాపై ఆరోపణలు.. బెంగాల్ అల్లర్ల పిటిషన్‌పై సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని ఏ రాష్ట్ర శాసనసభలోనైనా రెండుసార్లు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోదం ఇవ్వాల్సిన వ్యవహారంలో తాజాగా సుప్రీంకోర్టు గడువు విధించడంపై రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.
ఈ తీర్పుపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో పాటు బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటోందంటూ వారు విమర్శించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు పరోక్షంగా స్పందించింది. ఓ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ అంశాన్ని ప్రస్తావించింది.
వివరాలు
మేము పాలన వ్యవస్థపై జోక్యం చేస్తున్నామనే విమర్శలు
వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల కొన్ని అల్లర్లు జరిగాయి.
దీనికి సంబంధించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.
ఈ సందర్భంలో జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ''ప్రస్తుతం మేము పాలన వ్యవస్థపై జోక్యం చేస్తున్నామనే విమర్శలు ఎదుర్కొంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వమంటారా?'' అని సందేహం వ్యక్తం చేశారు.
వివరాలు
వారు సూపర్ పార్లమెంటుగా మారిపోతున్నారు: జగదీప్ ధన్‌ఖడ్
ఇదిలా ఉండగా, ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ''రాష్ట్రపతికి గడువులు విధించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సమంజసం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు మన దగ్గర న్యాయమూర్తులు శాసనాలు చేస్తూ, పాలనా విధులు కూడా నిర్వహిస్తున్నారు. వారు సూపర్ పార్లమెంటుగా మారిపోతున్నారు. కానీ వారిపై మాత్రం ఎలాంటి జవాబుదారీ తత్వం ఉండడం లేదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు,'' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంలో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ,''ఒకవేళ సుప్రీంకోర్టే చట్టాలు చేయడం ప్రారంభిస్తే,ఇకపై పార్లమెంట్ భవనాన్ని తాళాలు వేసేయాల్సిందే,''అని విమర్శించారు.అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా విభేదిస్తున్నాయి.