Delhi: దిల్లీలో ప్రధాని మోడీతో ఫడ్నవిస్ చర్చలు.. కేబినెట్ కూర్పుపై సమీక్ష
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుతం హస్తిన పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత బుధవారం తొలిసారి దిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఫడ్నవిస్, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్‌తో కూడా కలిసి మాట్లాడారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ఫడ్నవిస్, కేబినెట్ కూర్పుపై చర్చించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడినా రాజకీయ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడింది.
హోంమంత్రి పదవిని అశిస్తున్న శివసేన
ఈ సమయంలో మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి పదవిపై తీవ్ర పంచాయితీ జరిగింది, చివరకు బీజేపీ ఈ పదవిని దక్కించుకుంది. ప్రస్తుతం, ఫడ్నవిస్ తన కేబినెట్ కూర్పు పనుల్లో ఉన్నారు. శివసేన నేత షిండే హస్తినకు వెళ్లకపోయినా, ముంబైలోనే ఉన్నారు. శివసేన హోంమంత్రి పదవిని ఆశిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఫడ్నవిస్ ఈ పదవిని తన వద్ద ఉంచుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బీజేపీ, ఎన్సీపీ మంత్రిపదవులపై క్లారిటీకి వచ్చాయనే సమాచారం ఉంది. బీజేపీకి 22, శివసేనకు 11, ఎన్సీపీకి 10 మంత్రిపదవులు కేటాయించినట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్ శివసేనకు హోంశాఖ ఇవ్వాలని సుముఖంగా లేని పరిస్థితి ఉంది.
132 స్థానాలకు కైవసం చేసుకున్న మహాయితి
ఇక శివసేన ఫోర్ట్‌పోలియో బాధ్యతను కోరుతుండగా, ఫడ్నవిస్ ఈ పదవిని ఇవ్వడం లేదన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే కేబినెట్ విస్తరణ ప్రక్రియ చివరికి డిసెంబర్ 14లో ముగియాలని ఫడ్నవిస్ భావిస్తున్నారు. కానీ ఫోర్ట్‌పోలియోపై ఇంకా పంచాయితీ కొనసాగుతున్నందున, దీనికి మరిన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ ఎన్నికలలో మహాయుతి బీజేపీ (132), శివసేన (57), ఎన్సీపీ (41) స్థానాలు గెలుచుకున్నాయి.