బీజేపీలోకి వచ్చిన జయసుధ.. ప్రధానిని చూసే కషాయ కండువా కప్పుకున్నట్లు స్పష్టం
ప్రముఖ సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె కషాయ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్,జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ సభ్యత్వ రసీదును అందజేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జయసుధ భేటీ అయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు భాజపా అండగా ఉంటుందని అమిత్ షా చెప్పారు. ఈ క్రమంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడిన జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుల సంక్షేమం కోసం తాను పనిచేస్తానని ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందన్నారు.
తాను బీజేపీని ఎంచుకోవడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారు : జయసుధ
ఈ మేరకు మోదీ అభివృద్ధిని చూసే బీజేపీలో చేరినట్లు జయసుధ వివరించారు. తాను బీజేపీని ఎంచుకోవడంపై చాలా మంది ఆశ్చర్యపోతున్నారని చెప్పుకొచ్చారు. మంచి మార్పు కోసమే కషాయ తీర్థం పుచ్చుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తరఫున 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి జయసుధ, సంచలన విజయం నమోదు చేశారు. ప్రస్తుతం మరోసారి సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టిక్కెట్ ఆశిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కొట్టిపడేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రజలకు విశేషంగా సేవలు అందించారన్న కిషన్ రెడ్డి, పేదలు, బస్తీల అభివృద్ధి కోసం నిజాయితిగా కృషి చేశారని ప్రశంసించారు. బీజేపీలో జయసుధ చేరిక శ్రేణులకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుందన్నారు. బీజేపీ తెలంగాణలో ప్రభుత్వంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.