
Deputy CM Pawan: ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణమరాజు మృతి.. ఘటనపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
ఈ వార్తాకథనం ఏంటి
చిత్తూరు జిల్లా సోమల మండలంలోని కొత్తూరు గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు రామకృష్ణమరాజు ఏనుగుల గుంపు దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న గ్రామస్థులు, రాత్రి నుంచి మృతదేహాన్ని కదిలించేందుకు నిరాకరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే రామకృష్ణమరాజు మరణానికి కారణమని వారు ఆరోపిస్తూ, న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపేది లేదని తేల్చి చెప్పారు. దీన్ని గమనించిన చిత్తూరు డీఎఫ్ఓ తక్షణమే సంఘటన స్థలానికి బయలుదేరారు. అటవీశాఖ అధికారుల అజాగ్రత్తపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల కదలికలపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వకుండా, రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మండిపడుతున్నారు.
Details
తగిన పరిహారం చెల్లించాలి
ఇదిలా ఉండగా, చిత్తూరు జిల్లా అవులపల్లె పంచాయతీ పరిధిలోని కొత్తూరుకు చెందిన రైతు రామకృష్ణమరాజు మరణ వార్తపై ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనను గంభీరంగా పరిగణించిన ఆయన, వివరాలను అటవీశాఖ అధికారుల నుంచి సమీక్షించారు. ఏనుగుల గుంపులు వెళ్తున్న దారులను నిరంతరం ట్రాక్ చేస్తూ, వాటి మార్గంలో ఉన్న గ్రామాలకు ముందస్తు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే రామకృష్ణమరాజు కుటుంబాన్ని అటవీ శాఖ, జిల్లా యంత్రాంగం పరామర్శించి తగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.