
'Dilli Chalo': హర్యానా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. రైతులను అడ్డుకున్న పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో రైతులు మరోసారి తమ హక్కుల కోసం పోరాట బాట పట్టారు.
పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం సహా పలు డిమాండ్ల సాధన కోసం, పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద 'ఢిల్లీ చలో' పేరుతో భారీ నిరసన చేపట్టారు.
ఈ క్రమంలో రైతులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయగా,పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
పోలీసులు ఒక రైతును అదుపులోకి తీసుకున్నారు.రైతులు శంభు సరిహద్దుకు చేరుకొని ఢిల్లీ సరిహద్దుల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తుండగా, భద్రతా బలగాలు బారికేడ్లతో వారిని అడ్డుకున్నాయి.
రైతుల నిరసనల కారణంగా హర్యానాలోని అంబాలా సహా కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
వివరాలు
మూడంచెల బారికేడ్ల ఏర్పాటు
అదే సమయంలో గ్రేటర్ నోయిడాలోని పరి చౌక్ వద్ద నిరసనలో పాల్గొంటున్న కొంతమంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దుల్లో కేంద్ర పారా మిలటరీ బలగాలను మోహరించి, మూడంచెల బారికేడ్లను ఏర్పాటు చేసింది.
ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా నిషేధాజ్ఞలు అమలు చేశారు.
కిసాన్ మజ్దూర్ మోర్చా సమన్వయకర్త శర్వణ్ సింగ్ పాంథేర్ మాట్లాడుతూ, రైతులు ట్రాక్టర్లు లేదా ట్రాలీలు తీసుకురాకుండా, కేవలం కాలినడకన పాదయాత్ర చేయాలని నిర్ణయించారని తెలిపారు.
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు శంభు సరిహద్దు నుంచి 101 మంది రైతులతో పాదయాత్ర ప్రారంభించి, ఢిల్లీ వైపు మార్చ్ చేయాలనే సంకల్పం తీసుకున్నామని పేర్కొన్నారు.