Andhrapradesh: పంటల వారీ నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాలి: వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్
2019 వరకు అమలులో ఉన్న పంటల బీమా విధానాన్ని కొనసాగిస్తామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ తెలిపారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా (పీఎంఎఫ్‌బీవై) సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాలపై రైతుల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్లను కోరారు. ఈ పథకంలో, నిర్ణయించిన ప్రీమియాన్ని రైతులే చెల్లించాల్సి ఉంటుందని ఆయన వివరించారు. రబీ పంటల బీమా అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ప్రణాళిక అధికారులు, వ్యవసాయ, ఉద్యాన అధికారులు, లీడ్ బ్యాంకు మేనేజర్లు, కామన్ సర్వీస్ కేంద్రాల నిర్వాహకులతో గురువారం నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
రైతులు గ్రామ సచివాలయాలు,ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా ప్రీమియాన్ని చెల్లించాలి
రుణాలు తీసుకోని రైతులు గ్రామ సచివాలయాలు,ఉమ్మడి సేవా కేంద్రాల ద్వారా ప్రీమియాన్ని చెల్లించవచ్చని చెప్పారు. జాతీయ పంటల బీమా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. పంట రుణాలు తీసుకునే సమయంలో, రైతుల బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులు మినహాయిస్తాయని, అంగీకారం తెలుపకపోతే ఆ మొత్తం తిరిగి వెనక్కి వస్తుందని ఆయన వివరించారు. జీడిమామిడికి నవంబరు 15వ తేదీకి పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉందని ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. వాతావరణ ఆధారిత బీమా కింద టమాటాకు బీమా అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నంద్యాల జిల్లాలో సెనగను వాతావరణ ఆధారిత బీమాలో అమలుచేయాలని అధికారులు సూచించారు.
సమావేశంలో బీమా సంస్థల ప్రతినిధులు
కొందరు పంటల బీమా నమోదుకు సమయం పొడిగించాలని కోరారు. రబీ బీమాపై జిల్లాస్థాయి పర్యవేక్షణ సమావేశాల్లో తరచుగా సమీక్షలు నిర్వహించాల్సిందిగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సమావేశంలో బీమా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.