Delhi: రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో కంక్రీట్ వాల్, రోడ్డుపై మేకులు
రైతుల ఆందోళనలు దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్నాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టాలని రైతులు కోరుతున్నారు. డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు శంభు సరిహద్దు నుంచి దిల్లీ వైపు 101 మంది రైతుల 'జాతా' ప్రారంభం కానుంది. రైతుల బృందం డిసెంబర్ 6న దిల్లీ వైపు బయలుదేరింది. అయితే, హర్యానా పోలీసులు వారిని శంభు సరిహద్దు వద్ద అడ్డుకున్నారు. దీంతో ఆందోళన చేస్తున్న రైతులు పోలీసుల బారికేడ్లను ధ్వంసం చేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. స్పందించిన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించడంతో 16 మంది రైతులు గాయపడ్డారు.
11 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
అనంతరం, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధర్ ఈ మార్చ్‌ను రెండు రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించారు. కేంద్రం నుంచి చర్చల ప్రతిపాదన వచ్చినపుడు, వారు త్వరగా స్పందిస్తామని తెలిపారు. ఇక, దిల్లీ వైపు రైతులు వెళ్లకుండా అడ్డుకునేందుకు, సరిహద్దులో బారికేడింగ్ పటిష్టంగా ఏర్పాటు చేశారు. రోడ్లపై ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు హర్యానా ప్రభుత్వం అంబాలా జిల్లాలోని 11 గ్రామాల్లో బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ సస్పెన్షన్ డిసెంబర్ 9 వరకు కొనసాగనుంది.