MS Swaminathan : హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
భారతదేశం హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. 98 ఏళ్ల స్వామినాథన్ ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేషంగా కృషి చేశారు. తన అశేష పరిశోధనలతో సరికొత్త వంగడాలను సృష్టించారు. తమిళనాడులో 1925, ఆగస్ట్ 7న జన్మించిన స్వామినాథన్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామన్ మెగసెసె లాంటి అత్యున్నతమైన సత్కారాలను పొందారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. భారతదేశంలోని తక్కువ ఆదాయ రైతులు, అల్పాదాయ కౌలు రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేసేందుకు స్వామినాథన్ పరిశోధనలు చాలా సహాయపడ్డాయి.
గాంధీ ప్రభావంతో వ్యవసాయంలో ఉన్నత విద్య
మరోవైపు స్వామినాథన్ మృతి పట్ల దేశంలోని ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. స్వామినాథన్ చెన్నైలో రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించిన తర్వాత 1987లో తొలి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. రామన్ మెగసెసే అవార్డు (1971), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు (1986)ను ఒడిసిపట్టారు. స్వామినాథన్‌కు భార్య మినాతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1. సౌమ్య స్వామినాథన్, 2. మధుర స్వామినాథన్, 3. నిత్యా స్వామినాథన్ ఉన్నారు. కుంభకోణంలో ఎం.కె. సాంబశివన్, పార్వతి తంగమ్మాళ్ రెండో కుమారుడిగా స్వామినాథన్ జన్మించిన స్వామినాథన్ పాఠశాల విద్యను స్థానికంగానే చదివారు. స్వాతంత్ర ఉద్యమంలో తండ్రి భాగస్వామ్యంతో గాంధీ ప్రభావంతో వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బీజం పడటం విశేషం.