TamilNadu Mobile Blast: వేర్వేరు చోట్ల పేలిన సెల్ ఫోన్లు.. అక్కడికక్కడే మహిళా మృతి
భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో మొబైల్ ఫోన్లు పేలి ప్రకంపణలు సృష్టించాయి. ఈ మేరకు ప్రాణ నష్టం సైతం సంభవించింది. ఈ క్రమంలోనే వేర్వేరు రాష్ట్రాల్లో జరిగిన ఫోన్లు పేలుడు తీవ్ర విషాదాలు నింపాయి. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఓ షాపులో చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలి ఓ మహిళ ఘటనా స్థలంలోనే మరణించింది. రాజపురం గ్రామానికి చెందిన గోలిక, మొబైల్ ఫోన్ల దుకాణం నిర్వహిస్తోంది. బుధవారం ఎప్పటిలాగే ఫోన్ చార్జింగ్ పెట్టి, అదే ఫోన్‌లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ఫోన్ పేలింది. దీంతో షాపును మంటలు చుట్టుముట్టాయి. తీవ్ర గాయాలపాలైన గోలికను స్థానికులు రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలోనే బాధితురాలు తీవ్ర గాయాలతో ప్రాణం విడవడం రాష్ట్రంలోనే కలకలం రేపింది.
మహారాష్ట్రలోనూ ఫోన్ పేలుడు, ముగ్గురికి గాయాలు, ఒకరి విషమం
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోనూ ఫోన్ పేలింది. ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ ఢామ్మని పెద్ద శబ్దంతో పేలిపోయింది. ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పేలుడు థాటికి ఇంటి తలుపులు, కిటికీలతో పాటు బయట పార్క్ చేసిన వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. ఘటనతో ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తలు తీవ్ర గాయాల బారిన పడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే మొబైల్ పక్కనే ఓ సెంటు బాటిల్ ఉందని, అది కిందపడటం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఫోన్ చార్జింగ్ పెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఉష్ణోగ్రత కారణంగా బ్యాటరీ వేడెక్కుతుంటాయి. అందువల్ల చార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ మాట్లాడకపోవడం శ్రేయస్కారమని నిపుణులు సూచిస్తున్నారు.