Parliament Security Breach: పార్లమెంట్ పై దాడికి నెల ముందే ప్రణాళిక.. నిందితులపై UAPA కేసు
పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో నిందితులపై దిల్లీ పోలీసులు ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల(నిరోధక) చట్టం(UAPA) కింద కేసు నమోదు చేసినట్లు ANI నివేదించింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నలుగురు నిందితుల విద్యా నేపథ్యం,అంతకముందు ఏదైనా నిరసనలు లేదా ర్యాలీలతో సహా గత కార్యకలాపాలలో వారి ప్రమేయం,బుధవారం నాటి సంఘటనకు ముందు వారు పార్లమెంటును సందర్శించారా అనే విషయాలతో సహా వివిధ అంశాలను కూడా దర్యాప్తు చేస్తుందని వార్తా సంస్థ మూలాలను ఉటంకిస్తూ నివేదించింది. అంతేకాకుండా వారి సోషల్ మీడియా కార్యకలాపాలపై కూడా దృష్టి సారించనుంది. బుధవారం పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘనలపై హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.
పొగ దాడి పార్లమెంటు లోపల,బయట కూడా జరిగింది
సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్ ఆధ్వర్యంలో ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ పార్లమెంటు భద్రత ఉల్లంఘనకు గల కారణాలను పరిశీలించి, లోపాలను గుర్తించి తదుపరి చర్యలను సిఫారసు చేస్తుంది. అంతకుముందు రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్‌సభలోని సందర్శకుల గ్యాలరీ నుండి గుర్తుతెలియని వ్యక్తులు దూకి టియర్ గ్యాస్ పట్టుకుని సభలోనే నినాదాలు చేశారు. ఈ పొగ దాడి పార్లమెంటు లోపల మాత్రమే కాదు, పార్లమెంటు బయట కూడా జరిగింది. బయట మరో ఇద్దరు వ్యక్తులు ఇలాంటి చర్యకే పాల్పడ్డారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. అనంతరం నలుగురిని అరెస్టు చేశారు.
పార్లమెంట్ ఆవరణలో రెక్కీ
వీరి నలుగురితో బాటు విశాల్‌ని అనే వ్యక్తిని కూడా కూడా అదుపులోకి తీసుకున్నామని, వీరందరూ గురుగ్రామ్ ఇంట్లో వారు ఉంటున్నారని పోలీసులు తెలిపారు. కాగా, ఆరో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. దీని కోసం నెల రోజుల నుంచి ప్తాన్ వేసినట్లు విచారణలో వెల్లడైంది. రైతుల నిరసన, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలతో విసిగిపోయినందునే తాము ఈ చర్యకు పాల్పడ్డామని విచారణ సందర్భంగా అమోల్ చెప్పినట్లు పీటీఐ నివేదించింది. ఆరుగురు నిందితులు నాలుగేళ్లుగా ఒకరికొకరు తెలుసు. సోషల్ మీడియా ద్వారా నిరంతరం టచ్‌లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే ప్లాన్ వేసుకుని పార్లమెంట్ ఆవరణలో రెక్కీ కూడా నిర్వహించారు.