Tejasvi Surya: కర్ణాటక హవేరీ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై పోలీసు కేసు నమోదైంది. వక్ఫ్ భూముల సమస్యతో సంబంధం ఉన్న రైతు ఆత్మహత్యపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉండటంతోనే ఈ చర్యలు తీసుకున్నారని అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హవేరి జిల్లాకు చెందిన రైతు రుద్రప్ప చన్నప్ప బాలికై తన భూమిని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మంత్రి జమీర్ అహ్మద్ చర్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని తేజస్వీ సూర్య ఇటీవల సోషల్‌మీడియా వేదికగా ఆరోపించారు. అయితే హవేరీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకారం, రుద్రప్ప ఆత్మహత్యకు కారణం వక్ఫ్ భూములు కాదని, పంట నష్టం, రుణ భారం అని స్పష్టం చేశారు.
రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్
ఈ ఘటనపై, తేజస్వీ సూర్యతో పాటు రెండు కన్నడ పత్రికల ఎడిటర్లపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వక్ఫ్ భూములకు సంబంధించిన నోటీసులపై హవేరీ రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా, రుద్రప్ప ఆత్మహత్యకు ఇదే కారణమని పత్రికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సూర్య తన సోషల్ మీడియా పోస్టును తొలగించారు. కర్ణాటకలో వక్ఫ్ భూముల సమస్యలు ఉద్రిక్తతలకు దారితీస్తున్న నేపథ్యంలో, ఎంపీ తేజస్వీ సూర్య, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్ రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. వక్ఫ్ ఆస్తులపై పూర్తి నివేదికను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమర్పిస్తామని పాల్ హామీ ఇచ్చారు.