Fire Accident: శిశువుల వార్డులో అగ్ని ప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలో శుక్రవారం రాత్రి విషాద ఘటన జరిగింది. శిశువుల వార్డులో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చిన్నారులు ప్రాణాలను కోల్పోయారు. మరో 16 మంది చిన్నారులు గాయపడ్డారు. SNCU (శిశువుల వార్డు)లో రాత్రి 8.30 గంటలకు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 54 మంది నవజాత శిశువులు ఉన్నట్లు డివిజనల్ కమిషనర్ బిమల్ కుమార్ దూబే వెల్లడించారు. ఆక్సిజన్ అధికంగా ఉండటంతో మంటలు వేగంగా విస్తరించాయి. అగ్నిమాపక దళం, ఆర్మీ సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ సమయంలో కిటికీలు, తలుపులు పగలగొట్టి 40 మందికిపైగా చిన్నారులను బయటకు తీసుకొచ్చారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం : ఉప ముఖ్యమంత్రి
శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వార్డులో పొగలొచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కొద్దిసేపటికే మంటలు భారీగా చెలరేగడంతో ప్రజల్లో భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది చొరవ చూపి, పిల్లలను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్, దర్యాప్తు జరిపించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను ఆదేశించారు . 12 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ అండగా ఉంటుందని తెలిపారు.