లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణీకుల
లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ లో రాత్రి మంటలు చెలరేగి దట్టమైన పొగ అల్లుకోవడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగిపోయారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. చెన్నై నుంచి ముంబై బయలుదేరిన ఎక్స్‌ప్రెస్ రైలులో కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. ఎంజీఆర్ చెన్నై రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు, చెన్నై బేసిన్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఇంజిన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు సంభవించాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెసుకొచ్చారు. అనంతరం రైలు యథావిధిగా బయలుదేరింది.
రైలు ప్రయాణమంటేనే భయం భయం
రైలు సాయంత్రం 6.20 గంటలకు చెన్నె నుంచి బయలుదేరగా, 6.48 గంటలకు మంటలు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో మంటల దృశ్యాలను పలువురు ప్రయాణికులు తమ ఫోన్లలో బంధించారు. మరమ్మతుల అనంతరం 7.15 గంటలకు రైలు ముంబై బయలుదేరింది. మరోవైపు రైలు బండి ఎక్కాలంటేనే ప్రయాణికులు వణికిపోతున్నారు. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాద ఘటన తర్వాత మరికొన్ని ఉదంతాలు చోటు చేసుకున్నాయి. పలు చోట్ల గూడ్స్ రైళ్లు పట్టాలు తప్పడం, కొన్ని చోట్ల పట్టాలు వంగిపోవడంతో ముందస్తుగానే లోకో పైలెట్లు అప్రమత్తమయ్యారు. కానీ తాజాగా గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ కి ప్రమాదం తప్పింది.విరిగిన రైలు పట్టాలను కీమ్యాన్ గుర్తించారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్టైంది.