Odisha train accident: అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది; అసలు మూడు ట్రైన్లు ఎలా ఢీకొన్నాయంటే?
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఇది దేశంలోనే అత్యంత విపత్కర సంఘటల్లో ఒకటిగా నిలిచిపోయింది. అయితే మూడు రైళ్లు(బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు) ఢీకొనడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఈ రైలు ప్రమాదంలో 290మంది మృతి చెందగా, 900మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంతటి ఘోరమైన ప్రమాదం ఎలా జరిగింది? అసులు ఈ మూడు రైళ్లు ఎలా ఢీకొన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యక్ష సాక్షులు, అధికారులు ఇలా చెప్పారు
రైల్వే అధికారులు, ప్రత్యేక్ష సాక్షులు ప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఈ ప్రమాదం అంతా నిమిషాల్లో జరిగినట్లు చెప్పారు. షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సాయంత్రం 6:30 గంటలకు బాలాసోర్ చేరుకుంది. సుమారు రాత్రి 7:20 గంటలకు బాలేశ్వర్ సమీపంలో రైలు 10 నుంచి 12 బోగీలు పట్టాలు తప్పాయి. అవి ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయాయి. ఎదురుగా ఉన్న ట్రాక్‌పై పడిపోయిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను కొద్ది సేపటికి వేగంగా దూసుకొచ్చిన బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. దీంతో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులోని నాలుగు బోగీలు బోల్తా పడిపోయాయి. ఈ బోగీలను కొద్ది సేపటికే వచ్చిన గూడ్స్ రైలు వచ్చి ఢీకొంది. అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది.
రైలు ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ
మరోవైపు ఒడిశా రైలు దుర్ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ జరుపుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైలు భద్రతా కమిషనర్ స్వతంత్ర విచారణ కూడా చేస్తారని వెల్లడించారు. ఈ ఘోర రైలు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శనివారాన్ని సంతాప దినంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. , మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్) నుంచి అందజేస్తామని ప్రకటించారు.