ఒడిశా విషాదం జరిగిన ట్రాక్‌పై 51గంటల తర్వాత తొలి రైలు ప్రయాణం
ఒడిశాలోని బాలాసోర్ ప్రమాద స్థలంలో అప్, డౌన్ రైల్వే ట్రాక్‌లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఈ క్రమంలో రైలు ప్రమాదం జరిగిన దాదాపు 51 గంటల తర్వాత ఆ ట్రాక్‌పై తొలి ట్రైన్ ప్రయాణించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్రమంలో తొలి రైలు ప్రయాణిస్తున్నప్పుడు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, ప్రమాదం జరిగిన ట్రాక్ వద్దే ఉన్నారు. రైలు ప్రయాణిస్తున్న వీడియోలను మంత్రి ట్విట్టర్‌లో పంచుకున్నారు. అంతకు ముందు డౌన్‌లైన్, అప్ లైన్ ట్రాక్‌ల మరమ్మతులు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. దేశ చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ఒకటిగా నిలిచింది. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 275మంది మరణించారు. 1,100మందికి పైగా గాయపడ్డారు.
గాయపడిన వారిలో 900 మంది డిశ్చార్జ్
షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్, గూడ్స్ రైలు శుక్రవారం రాత్రి 7 గంటలకు ఢీకొన్నాయి. పీటీఐ సమాచారం మేరకు, గాయపడిన వారిలో దాదాపు 260మంది ప్రస్తుతం ఒడిశాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అంతేకాకుండా, ఇప్పటివరకు సుమారు 900 మంది డిశ్చార్జ్ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమంటూ ప్రతిపక్ష సభ్యులు మండిపడుతున్నారు. వైష్ణవ్ రాజీనామా చేయాలని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ డిమాండ్ చేశారు.