
Nizamabad: హోలీ పండుగ రోజున అక్కడ పిడిగుద్దులాట ఆనవాయితీ అంట!!!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దు: నిజామాబాద్ జిల్లాలో సాలురా మండలం హున్సా గ్రామంలో పూర్వీకుల కాలం నుంచి పిడిగుద్దులాట ఆడుతున్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున ఇక్కడ పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వినటానికి వింతగా ఉన్నా, ఇది ఆ గ్రామ వింత ఆచారం.
కులమత, వయోబేధం లేకుండా గ్రామం సుభిక్షత కోసం దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు.
పోలీసు శాఖ నుంచి అభ్యంతరాలు ఉన్నా తమ గ్రామ శ్రేయస్సు కోసం పిడిగుద్దులు తప్పవని గ్రామస్తులు నమ్మకం.
ఒకవేళ హోలీ పండుగ రోజు ఈ వింత పిడిగుద్దులాట జరగకపోతే ఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా కీడు జరుగుతుందని వారి నమ్మకం.
ఈ సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున జాతర కొనసాగుతుంది.
పిడిగుద్దులు
పిడిగుద్దులు
గ్రామ శివారులో పెద్దఎత్తున కుస్తీపోటీలు నిర్వహిస్తారు. ఈ కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మల్ల యోధులు, చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు తరలివస్తారు.
అనంతరం పిడిగుద్దులాట ప్రారంభమవుతుంది. ఆట ప్రారంభం ముందు పోలీసులకు సమాచారం కూడా అందిస్తారు.
రెండు గ్రూపులుగా విడిపోయి పిడిగుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడుకు ఇరువైపుల మోహరిస్తారు.
పిడిగుద్దులాటను ప్రారంభించి ఎడమ చేయితో తాడును పట్టుకుని కుడిచేయి పిడికిలితో ఒకరినొకరు బాదుకుంటారు.
సుమారు ఈ వేడుక 20 నిమిషాలపాటు కొనసాగుతుంది. రక్తం వచ్చిన చోట కాముని బూడిదతో తుడుచుకుంటారు.
ఈ వేడుక ముగిసిన అనంతరం గ్రామస్తులు అంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఎప్పటిలాగే కలిసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకొంటారు.