క్రమంగా తగ్గుతున్న యమునా ప్రవాహం.. దిల్లీ వీధుల్లో ఇంకా తగ్గని వరద ప్రభావం
గత కొన్ని రోజులుగా దిల్లీ రాజధానిని వణికిస్తోన్న యమునా నది ప్రస్తుతం శాంతిస్తోంది. క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నీటి ప్రవాహం తగ్గిపోతోంది. కానీ మహానగర వీధుల్లో వరద ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. సిటీలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే మగ్గిపోతున్నాయి. మురికి కాలువలు పొంగి పొర్లడంతో ట్రాఫిక్ విభాగం పలు సూచనలు చేసింది. ఈ మేరకు దిల్లీలోని భైరాన్ రోడ్డు, వికాస్ మార్గ్‌లో రాకపోకలను నిలిపేసింది. యమునా బ్యాంక్ మెట్రో స్టేషన్‌ను సైతం క్లోజ్ చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావంతో విద్యాసంస్థలనూ జులై 16 వరకు మూసివేశారు. నిత్యావసర వస్తువుల వాహనాలను మినహాయించి భారీ సరకుతో వచ్చే వాటి రాకపోకలపై నిషేధాజ్ఞలు ఉన్నాయి.
ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయం అర్థించిన దిల్లీ సర్కారు
యమునా నది నీరు తిరిగి నగరంలోకే ప్రవేశిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దిల్లీ ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ హెడ్ రెగ్యులేటర్ దెబ్బతినడమే కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్ సహాయం కోసం ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు క్రమంగా వెనక్కి వెళ్లడంతో గురువారం రాత్రి నుంచి యమున శాంతిస్తోంది. ఈ ఉదయం 6 గంటలకు నీటి మట్టం 208.46 మీటర్లగా ఉంది. అయినప్పటికీ ప్రమాద స్థాయి కంటే మూడు మీటర్లు ఎక్కువగానే ప్రవహిస్తోంది. దిల్లీలో శుక్రవారం తేలికపాటి జల్లులు కురుస్తాయని భారత వాతావారణ శాఖ అంచనా వేసింది.శనివారానికి సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేశామని పేర్కొంది.