ఫ్రాన్స్ నుంచి ప్రధాని మోదీ ఫోన్.. దిల్లీ వరదలపై అమిత్ షాతో సమీక్ష
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో వరదల పరిస్థితిపై ఆరా తీశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారు. దేశ రాజధాని పరిసరాల్లో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ఈ క్రమంలోనే ఉత్తరాది వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు దిల్లీ వరదల పరిస్థితి గురించి ప్రధాని మోదీ షాను అడిగి తెలుసుకున్నారు. రానున్న 24 గంటల్లో యమునా నదిలో నీటిమట్టం తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్లు అమిత్ షా ప్రధానికి వివరించారు. ఈ మేరకు దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తో కలిసి వరద పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సరిపడ సంఖ్యలో ఉన్నాయి: షా
విపత్తును ఎదుర్కోనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ (జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు) సరిపడ సంఖ్యలో ఉన్నాయని షా మోదీతో అన్నట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు సహాయ బృందాలను భారీగా మోహరించామని అమిత్ షా అన్నారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న యమునా నది వరద నీరు గురువారం మహానగరంలోని అనేక ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. దిల్లీ వరదలు మహానగర వాసుల రోజూ వారి జీవన విధానాన్ని అతలాకుతలం చేసిందని షా భావిస్తున్నారు. జూలై 16 వరకు రాజధాని ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కాలేజీలను మూసేయాలని ఈ మేరకు కేంద్రం తరుపున షా ఆదేశించారు. అయితే బాస్టిల్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ లో పర్యటిస్తున్నారు.