Page Loader
#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే 
వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దిల్లీ.. ఉత్తరాదిని ముంచేసిన వరుణుడు

#NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 13, 2023
06:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని ప్రాంతం దిల్లీ పరిసరాల్లో గత 3 రోజులుగా యమునా నది ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. అంతకంతకూ ప్రతిరోజూ రికార్డు స్థాయిలో ప్రమాదకరంగా ప్రవహిస్తూ సిటీని ముంచేసింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాది వాసులు భాయాందోళనకు గురవుతున్నారు. గత 45 ఏళ్లలో ఎప్పుడు లేని రీతిలో దిల్లీని వరద గుప్పిట బిగించింది. ఈ మేరకు ప్రస్తుత పరిస్థితిని కేంద్ర జలసంఘం తీవ్రమైనదిగా ప్రకటించింది. మరోవైపు దిల్లీలో వర్షాలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. అయినా వరదలు మాత్రం ఆగట్లేదు. యమునా నది ఉద్ధృతంగా ప్రవహించడానికి రెండు ప్రధాని బ్యారేజీలు కారణంగా తెలుస్తోంది. ఒకటి ఉత్తరాఖండ్‌ దెహ్రాదూన్‌లోని డాక్‌పత్తర్‌ , రెండోది హరియాణాలోని హత్నికుండ్‌.

DETAILS

హత్నికుండ్‌ నుంచి 2 రోజుల్లోనే దిల్లీకి వరద నీరు

అయితే వరద నీటిని నిలువచేసేందుకు, వీటిపై ఎటువంటి భారీ ప్రాజెక్టులు నిర్మించలేదు. ఈ నేపథ్యంలోనే వర్షాకాలం వచ్చిందంటే నీరు వృథాగా కిందికి ప్రవహిస్తాయి. దీంట్లో భాగంగానే దిల్లీ నగరానికి వరదల ముప్పు పొంచి ఉంటుంది. ఉత్తరాదిలో భారీ వర్షాలు ఓ వైపు, హత్నికుండ్‌ బ్యారేజీ నుంచి నీటిని దిగువకు వదలడం వల్ల దిల్లీ నీటమునుగుతోంది. హత్నికుండ్‌ బ్యారేజీలో సాధారణ ప్రవాహం 352 క్యూసెక్కులు. భారీ వర్షాల సమయంలో అధిక స్థాయిలో నీరు దిగువకు ప్రవహిస్తుంటుంది. స్వల్ప సమయంలోనే ఈ నీరు దిల్లీకి చేరుకుంటున్నట్లు గుర్తించినట్లు సీడబ్ల్యూసీ అధికారి వివరించారు. హత్నికుండ్‌ నుంచి 180 కిమీల దూరంలోని దిల్లీకి రెండు, మూడు రోజుల్లోనే వరద చేరుకుంటోంది.

DETAILS

22 కిమీ విస్తీర్ణంలో 20కిపైగా వంతెనలు ఉండటంతో పేరుకుపోతున్న పూడిక 

గతంలో నది ప్రవాహం సాఫీగానే జరిగేదని, ప్రస్తుతం ఆక్రమణల వల్ల ప్రవాహ మార్గం సన్నగిలిన్నట్లు అధికారులు చెప్పారు. దీంతో పాటు నదిలో పేరుకుపోతున్న పూడిక వరదలకు కారణంగా నిలుస్తోందన్నారు. యమునా నదిలో పేరుకున్న మట్టి వరదలకు కారణం అవుతోందన్నారు. మహానగరంలోని వజీరాబాద్‌ నుంచి ఓక్లా వరకు 22 కిమీ విస్తీర్ణంలో 20కిపైగా వంతెనలు ఉండటంతో పూడిక పేరుకుపోయేందుకు అదనపు కారణంగా నిలిచిందన్నారు. 1924, 1977, 1978, 1988, 1995, 1998, 2010 సహా 2013 లోనూ దిల్లీలో భారీ వరదలు సంభవించాయి. 1963 నుంచి 2010 వరకు సెప్టెంబర్‌లోనే వరదలు అధికంగా సంభవించినట్లు తేలింది. ఈసారి జులైలోనే ఊహించని రీతిలో వరదలు రావడం ఉత్తరాది వాసులతో పాటు అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతుండటం గమనార్హం.