Flying taxis: త్వరలో బెంగళూరును పలకరించనున్న ఎగిరే ట్యాక్సీలు..1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే!
బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport)త్వరలో ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా,తక్కువ ఎత్తులో పర్యావరణహిత ప్రయాణ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. నగరంలో ఎగిరే ట్యాక్సీలను ప్రవేశపెట్టనున్నట్లు వారు ప్రకటించారు.ఈ సేవలను అందించేందుకు సార్లా ఏవియేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఎక్స్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు. ఈ ట్యాక్సీలు, ట్రాఫిక్ అధికంగా ఉండే ప్రాంతాలు, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాల నుంచి, ఏ మాత్రం అంతరాయం లేకుండా,తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునేలా ఉంటాయని పేర్కొన్నారు. సార్లా ఏవియేషన్ సీఈఓ అడ్రియన్ ష్మిత్ మాట్లాడుతూ,ప్రస్తుతం ఇందిరానగర్ నుంచి విమానాశ్రయానికి చేరడానికి 1 గంట 50 నిమిషాలు పడుతోందని,అయితే ఎగిరే ట్యాక్సీల ద్వారా కేవలం 5 నిమిషాల ప్రయాణ సమయం ఉంటుందని వివరించారు.
బెంగళూరులో ప్రయాణ విధానంలో పెద్ద మార్పు
ఈ సేవలు ప్రారంభమైతే, బెంగళూరులో ప్రయాణ విధానంలో పెద్ద మార్పు వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, పూర్తిగా అందుబాటులోకి రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. ఫ్లయింగ్ ట్యాక్సీలు సాధారణ హెలికాప్టర్ల కన్నా వేగంగా ప్రయాణించడమే కాకుండా వాతావరణానికి హానిచేయకుండా ఉంటాయని, కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ సేవల ముఖ్య లక్ష్యంగా ఉంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులు పడుతున్న బెంగళూరు నగర ప్రజలకు ఈ ఎగిరే ట్యాక్సీలు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నారు. అనేక రాష్ట్రాలు కూడా ఈ తరహా సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.